Colour Smoke | న్యూఢిల్లీ : లోక్‌సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దుండగులు లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలర్ స్మోక్‌ను వదలగా, మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్‌ను వదిలి ఎంపీలను, పోలీసులను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే దుండగులు సభలో వదిలిన కలర్ స్మోక్ హానికరమైంది కాదని పోలీసుల విచారణలో తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలర్ స్మోక్ గురించి తెలుసుకుందాం.
కలర్ స్మోక్నే స్మోక్ క్యాన్స్, స్మోక్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. చాలా దేశాల్లో వీటి ఉపయోగానికి చట్టబద్ధత కూడా ఉంది. అన్ని రిటైల్ మార్కెట్లో కూడా వీటిని విక్రయిస్తారు. అయితే ఎక్కువగా మిలటరీ అధికారులు వినియోగిస్తారు. వారితో పాటు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించే వారు, ఫోటో షూట్లలో కూడా ఈ కలర్ స్మోక్‌ను వినియోగిస్తారు.
ప్రధానంగా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మిలటరీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లలో ఈ స్మోక్‌ను వినియోగిస్తారు. వారి కదలికలను అడ్డుకొని, శత్రువుల కళ్లు కనిపించకుండా చేసేందుకు ఈ కలర్ స్మోక్ ఉపయోగపడుతుంది. ఎయిర్ స్ర్టైక్స్, ట్రూప్ ల్యాండింగ్స్ల్లోనూ కలర్ స్మోక్‌ను వినియోగిస్తారు. వివాహ వేడుకలతో పాటు ఫోటోషూట్లలో ఎఫెక్ట్స్ కోసం కూడా కలర్ స్మోక్‌ను వినియోగిస్తారు. ఆటల్లో అయితే ప్రధానంగా ఫుట్ బాల్ గేమ్‌లో విరివిగా ఈ స్మోక్‌ను వినియోగించనున్నారు. తమ జట్టు ప్రాధాన్యత తెలిపే కలర్స్‌ను అభిమానులు వదులుతారు.