భువనేశ్వర్: ఒక పూరిగుడిసెపై ఏనుగు దాడి చేసింది. భయపడిన పెద్దలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను ఆ ఏనుగు తొక్కి చంపింది. (Sisters Trampled To Death By Elephant) ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బోనాయి అటవీ డివిజన్ తామడ పరిధిలో ఒక ఏనుగు సంచరిస్తున్నది. ఆదివారం తెల్లవారుజామున కాంతపల్లి గ్రామంలోని పూరింటిపై అది దాడి చేసింది. కొంత భాగాన్ని ధ్వంసం చేసింది. ఆ ఏనుగును చూసి ఆ ఇంట్లోని పెద్దలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను ఆ ఏనుగు తొక్కి చంపింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగు దాడిలో మరణించిన అక్కాచెల్లెళ్లను 12 ఏళ్ల సమియా, మూడేళ్ల చాందినిగా గుర్తించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మంద నుంచి తప్పించుకున్న ఆ ఏనుగును ట్రేస్ చేసి తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.