షిల్లాంగ్: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది(Coal Missing). ఆ నల్ల బంగారం మాయం కావడం పట్ల రాష్ట్ర సర్కారుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. బొగ్గు ఎక్కడికెళ్లిందో చెప్పాలని కోర్టు నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి కిర్మెన్ షిల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుశా వర్షాలు, వరదల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని ఆయన అన్నారు. జోరు వానల వల్ల బొగ్గు మాయమై ఉంటుందన్నారు. రాజాజూ, డెంగన్గాన్ గ్రామాల్లో ఉన్న బొగ్గు నిల్వల నుంచి సుమారు 4 వేల టన్నుల బొగ్గు కనిపించకుండాపోయింది. ఆ కేసులో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
బొగ్గు మాయం గురించి అడిగిన సమయంలో మంత్రి మాట్లాడుతూ.. మేఘాలయాలో అత్యధిక వర్షపాతం కురుస్తుందని, మీకు ఈ విషయం తెలియదని, ఆ వానల వల్ల బొగ్గు కొట్టుకుపోయే ఛాన్సు ఉందని అన్నారు. బొగ్గు ఎలా అదృశ్యమైందో చెప్పడం తన ఉద్దేశం కాదు అని, సహజ పద్ధతిలో ఆ బొగ్గు మాయమైందా లేక అక్రమ విధానాల వల్ల అది పోయిందా అన్న విషయాన్ని తేల్చలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. మేఘాలయాలో 2014 నుంచి బొగ్గు మైనింగ్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది. పర్యావరణ కారణాలు, అసురక్షిత పద్ధతుల వల్ల బొగ్గు తొవ్వకాలను నిలిపివేశారు.
మేఘాలయాలో అక్రమ రీతిలో మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఈ ఏడాది ఆరంభంలో ఈస్ట్ జైంతియా కొండల్లో బొగ్గు మైనింగ్‌ను ప్రారంభించారు. ఒకవేళ బొగ్గు మాయమైనా.. అది బ్రతకడం కోసమైతే అక్రమంగా జరిగి ఉంటుందేమో అని, లేదంటే ఆ బొగ్గును ఎవరు తీసుకెళ్తారని మంత్రి అన్నారు.