వైద్యో నారాయణో హరి అన్నది సామెత.. కానీ.. దళారీల కాసుల కక్కుర్తి.. ఎలాగైనా వైద్యవిద్యనభ్యసించి డాక్టర్ కావాలన్న ఆశ..లక్ష్య సాధనలో తప్పుదారి పడుతున్నారు. వైద్యవిద్యా కోర్సులో చేరాలంటే మేనేజ్మెంట్ కోటా సీటైతే రూ.కోట్లలో ఫీజు చెల్లించాలి. కానీ, వైద్య విద్యా ఎంట్రన్స్‌లో మంచి ర్యాంక్ వస్తే ప్రభుత్వకోటాలోనే సీటు పొందొచ్చు. అందుకోసం మధ్య దళారులకు రూ.లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు ఈ కుంభకోణం సూత్రధారులు నాలుగు రాష్ట్రాల్లో అవకతవకలకు పాల్పడ్డారని తేలింది.
వైద్యవిద్యా కోర్సుల్లో ఎంట్రన్స్‌ల కోసం ఆదివారం జరిగిన నీట్ పరీక్ష కోసం `రిగ్గింగ్ రాకెట్` రంగంలోకి దిగింది. పరీక్ష రాసే అభ్యర్థుల స్థానే ఇతరులతో రాయించడానికి దళారులు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకోసం ఒక్కో సీట్‌కు రూ.20 లక్షల ముడుపులు తీసుకున్నారు. ఇక పరీక్ష రాసిన విద్యార్థికి రూ.5 లక్షలు చెల్లించారని అభియోగాలు ఉన్నాయి. మిగతా మొత్తం ఈ వ్యవహారంలో మధ్యవర్తులు, అసలు సూత్రధారులు పంచుకున్నట్లు వారి సన్నిహిత వర్గాల కథం.
ఆదివారం జరిగిన పరీక్షకు హాజరైన నకిలీ అభ్యర్థుల్లో ఆరుగురిని సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. సఫ్దర్‌జంగ్‌కు చెందిన సుశీల్ రంజన్ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి సూత్రధారి అని సీబీఐ అధికారులు తేల్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసలు విద్యార్థుల స్థానే నకిలీ విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.