న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష (polygraph test) నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు గత వారం కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆయన పాత్రపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, వైద్యురాలి మృతదేహాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులను దాదాపు మూడు గంటలపాటు సందీప్ ఘోష్ వేచి ఉంచిన ఆరోపణలపై కూడా సీబీఐ ఆయనను ప్రశ్నించింది. అలాగే డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్ ప్రక్కనే ఉన్న గదుల పునరుద్ధరణ పనుల గురించి కూడా ఘోష్‌ను అడిగింది. ఆయన చెప్పిన సమాధానాలను లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా పోల్చి చూడాలని సీబీఐ భావిస్తున్నది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరెస్టైన వాలంటీర్ సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ ఇప్పటికే హైకోర్టు అనుమతిని పొందింది.