తిరువనంతపురం: కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం(Padmanabhaswamy Temple) సైబర్ దాడికి గురైంది. ఆలయానికి చెందిన కంప్యూటర్ వ్యవస్థ, సర్వర్ డేటాబేస్ హ్యాకైంది. ఆలయ నిర్వాహణ అధికారి.. సైబర్ పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. జూన్ 13వ తేదీన హ్యాకింగ్ జరిగినట్లు ఎఫ్ఐఆర్లో ఉన్నది. టెంపుల్ ఆపరేషన్స్‌ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు.
కంప్యూటర్లలో స్టోర్ చేసిన కీలక సమాచారాన్ని ట్యాంపర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత వివాదాల వల్ల హ్యాకింగ్ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్, గవర్నింగ్ కమిటీ సభ్యుల మధ్య వివాదం ఉన్నది. గతంలో కంప్యూటర్ సిస్టమ్స్‌ను నిర్వహించిన వ్యక్తిని తొలగించి, అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. ఆ తర్వాత అతిసున్నితమైన సమాచారం హ్యాక్ అయ్యింది.
గుడికి చెందిన ఆర్థిక లావాదేవీలు, గుడి పండుగులు, బ్యాంక్ వివరాలకు చెందిన సమాచారం హ్యాక్ అయినట్లు గుర్తించారు. బదిలీ అయిన తర్వాత కూడా మాజీ ఉద్యోగి ఆలయ కంప్యూటన్ నెట్‌వర్క్‌ను యాక్సిస్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనేక మంది అధికారులు లాగిన్ అయ్యేందుకు ఇటీవల ఇబ్బందిపడ్డారు. దీంతో అనుమానం వచ్చిన వాళ్లు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.
హ్యాకింగ్ ద్వారా ఆర్థిక నేరానికి పాల్పడ్డారా లేక ఇతర ఉద్దేశం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఆన్లైన్ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయా అని కూడా విచారించనున్నారు. జూన్ 13వ తేదీ నుంచి కొన్ని రోజుల పాటు హ్యాకింగ్ ప్రక్రియ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.