బెంగళూరు: మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన జూనియర్ స్టూడెంట్ను సీనియర్లు కొట్టారు. అతడ్ని హింసించటంతోపాటు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. స్థానికులమైన తాము అతడి భవిష్యత్తును భయానకంగా చేస్తామని హెచ్చరించారు. (Kashmiri Student Ragged) కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానిక అల్ అమీన్ మెడికల్ కాలేజీలో జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన హమీమ్, ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 18న సాయంత్రం ఆ కాలేజీ ఆవరణలో 2019, 2022 బ్యాచ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
కాగా, క్రికెట్ ప్లేయర్ అయిన హమీమ్ ఆ మ్యాచ్ చూసేందుకు అక్కడకు వెళ్లాడు. అయితే బౌండరీ లైన్ బయట ఉండాలని ఒక సీనియర్ స్టూడెంట్ ఆదేశించాడు. అక్కడకు వెళ్లిన అతడ్ని కొందరు సీనియర్లు అడ్డుకున్నారు. సీనియర్ల క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని నిలదీశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. నిరాకరించిన హామీమ్పై ర్యాంగింగ్కు పాల్పడ్డారు. పాటలు పాడాలని, డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. ఒక కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు సీనియర్ల ర్యాగింగ్‌ను రికార్డ్ చేసేందుకు హమీమ్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని మరింతగా హింసించారు. ఆ రాత్రి సుమారు ఎనిమిది మంది సీనియర్లు హామీమ్ హాస్టల్ రూమ్‌కు వెళ్లారు. అతడ్ని దారుణంగా కొట్టారు. బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. ‘నీకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి. మేం స్థానికులం. నీ జీవితాన్ని ఎంత భయంకరంగా మార్చగలమో ఊహించుకో’ అని అతడ్ని హెచ్చరించారు. కాలేజీలో ఇకపై అతడు క్రికెట్ ఆడకూడదని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, హమీమ్పై సీనియర్ల ర్యాగింగ్, దాడిని జమ్ముకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహామి ఖండించారు. సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా సంబంధిత సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.