న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఆమ్ ఆద్మీ నేత దీపక్ సింగ్లా(Deepak Singla)ను అరెస్టు చేసింది. ఢిల్లీ, గోవాతో పాటు అనేక ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవా రాష్ట్రానికి ఆప్ పార్టీ ఇంచార్జీగా ఉన్నారు. కస్టడీలోకి తీసుకోవడానికి ముందు ఆయన్ను ఈడీ కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఢిల్లీ రెండవ జోనల్ ఆఫీసుకు చెందిన ఈడీ ఆ వ్యక్తి గురించి ఆరా తీసింది. సింగ్లా హవాలా పద్దతిలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఢిల్లీ, గోవా మధ్య నిధులను చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు.
దీపక్ సింగ్లాతో పాటు అతని మామ అశోక్ కుమార్ మిట్టల్, సోదరుడు రమన్ సింగ్లా, హరీశ్ సింగ్లా.. వరుస పెట్టి ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్ లో సుమారు 150 కోట్ల నిధులను డీఫ్రాడ్ చేసినట్లు ఆరోపలు ఉన్నాయి. ఆ డబ్బును సింగపూర్‌కు పంపారని మనీ ల్యాండరింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే మళ్లీ అక్కడ నుంచి డబ్బు ఇండియాకు వచ్చేదని, హవాలా ద్వారా వచ్చిన ఆ సొమ్మును సింగ్లా అక్రమంగా వాడినట్లు తెలుస్తోంది.
గోవాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరెస్టు కావడం శోచనీయం.