లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు, పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎస్పీ ముస్లిం అభ్యర్ధి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందుతుందని తమ ప్రభుత్వం కొలువుదీరగానే తమను అణిచివేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఎస్పీ ముస్లి అభ్యర్ధి అదిల్ చౌధరీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
యూపీలో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని..తాము వారిని వదిలిపెట్టబోమని..తమను వేధిస్తున్న వారిని అంతకంతకూ బదులుతీర్చుకుంటామని, తమను వేధించే ముందు వారు వందసార్లు ఆలోచించుకోవాలని ఈ వీడియోలో ఆయన కాషాయ పార్టీ నేతలను హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్పీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదిల్ చౌధరీని ఎస్పీ మీరట్ సౌత్ నుంచి బరిలో దింపింది. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 159 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ఎస్పీ సోమవారం విడుదల చేసింది.
అఖిలేష్ యాదవ్ మొయిన్‌పురి జిల్లా కర్హాల్ స్ధానం నుంచి బరిలో నిలవగా, ఆయన బాబాయి ప్రగతిశీల సమాజ్‌వాది పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేస్తారు. ఇక వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఎస్పీ నేత ఆజం ఖాన్ రాంపూర్ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.