ChatGPT | సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టిస్తోంది ‘చాట్ జీపీటీ’ (ChatGPT). ఇదో కొత్తతరం సెర్చ్ ఇంజిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)తో పనిచేసే ఈ టూల్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ (ChatGPT)ని అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా పంజాబ్-హర్యానా హైకోర్టు (Punjab Haryana high court) సైతం న్యాయ సలహా కోసం ‘చాట్ జీపీటీ’ (ChatGPT)ని ఆశ్రయించింది. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన నిందితుడికి బెయిల్ మంజూరు (bail plea) విషయంలో ‘చాట్ జీపీటీ’ సూచనలు అడిగి తెలుసుకుంది.
ఇతరులపై క్రూరంగా దాడిచేసిన వ్యక్తుల బెయిల్ అభ్యర్థన (bail plea)పై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి..? అని జడ్జిలు అడిగారు. దీనికి చాట్ జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనుషుల్ని చంపుతున్నారు కాబట్టి బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తాను అని సమాధానమిచ్చింది. అంతేకాదు, దాడి క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిలు మంజూరు చేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నిర్దోషినని నిరూపించుకునేందుకు బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప బెయిలుకు అర్హుడు కాదని తేల్చి చెప్పింది. కాకపోతే, నిందితుడి నేరప్రవృత్తి, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులు బెయిలు మంజూరు చేయొచ్చని చాట్ జీపీటీ సూచించింది.
నిందితులకు బెయిలు మంజూరు విషయంలో ‘చాట్ జీపీటీ’ని (ChatGPT) న్యాయ సలహా కోరడంపై న్యాయమూర్తులు స్పందించారు. న్యాయశాస్త్రంపై ‘చాట్ జీపీటీ’కి ఎలాంటి అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేసినట్లు స్పష్టం చేశారు. అంతే తప్ప చాట్ జీపీటీ వెల్లడించే అభిప్రాయాలను పాటించడానికి కాదని తెలిపారు. ‘చాట్ జీపీటీ’ ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తీర్పులను వెలువరించ కూడదని జస్టిస్ అనూప్ చిట్కారా (Justice Chitkara) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఈ సంఘటన మొట్టమొదటదిగా భావిస్తున్నారు.
ఇక, అసలు విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన నిందితుడిపై 2020లో హత్య, ఇతర నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. బెయిలు కోసం నిందితుడు పెట్టుకున్న దరఖాస్తుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో నిందితుడు బెయిల్‌కు అర్హుడని పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నిందితుడి గతాన్ని బట్టి బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడిని బెయిలుపై విడుదల చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.
Also Read..
India Corona | భారీ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే ప్రథమం..!
Telugu Movies | మార్చి చివరి వారం సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 19 సినిమాలు విడుదల