బెంగుళూరు: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా(Shubhanshu Shukla) .. భారతీయ అంతరిక్ష కేంద్రం చైర్మెన్ వీ నారాయణన్తో ఫోన్లో మాట్లాడారు. ఆక్సియం-4 మిషన్లో భాగంగా శుక్లా ఐఎస్ఎస్ వెళ్లిన విషయం తెలిసిందే. తన ఐఎస్ఎస్ ప్రయాణం సురక్షితంగా సాగేందుకు ఇస్రో సహకరించినట్లు శుక్లా చెప్పారు. జూలై 6వ తేదీన మధ్యాహ్నం వీ నారాయణన్తో శుక్లా సంభాషించినట్లు ఇస్రో తెలిపింది. శుక్లా ఆరోగ్య సమాచారం గురించి ఆసక్తిగా చైర్మెన్ అడిగి తెలుసుకున్నారు. స్పేస్ స్టేషన్లో జరుగుతున్న వివిధ రకాల శాస్త్రీయ పరిశోధనల గురించి కూడా ఆరా తీశారు. అన్ని పరిశోధనలు, కార్యక్రమాలకు చెందిన శుక్లా అనుభవాలను డాక్యుమెంట్ ఛేయాలని ఇస్రో చైర్మెన్ భావిస్తున్నారు. గగన్యాన్ ప్రోగ్రామ్ చేపడుతున్న నేపథ్యంలో శుక్లా అనుభవాలు ఉపయోగపడుతాయని ఇస్రో అంచనా వేస్తున్నది.