(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ):ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి దినాల్ని దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచానికి అన్నపూర్ణగా పిలిచే దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. 75 ఏండ్ల ప్రజాస్వామ్య భారతంలో కనీవినీ ఎరుగని రీతిలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో పనిచేయగల శ్రామికశక్తి 85 కోట్ల మంది ఉన్నప్పటికీ, ఉపాధి దొరక్కుండా ఇంకా 22 కోట్ల మంది వీధుల్లో చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలిచే దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎనిమిదిన్నరేండ్ల బీజేపీపాలనలో వైఫల్యాలకు 2022 సంవత్సరం కూడా మూగసాక్షిగా మిగిలిపోయింది.
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. దేశ చరిత్రలో 2022కు ప్రత్యేక స్థానమున్నది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన అమృత ఘడియలకు వేదికగా నిలిచిన సంవత్సరమిది. అయితే, పేద, మధ్యతరగతి జీవులకు ఈ ఏడాది కూడా ఏ మాత్రం సాంత్వన తీసుకురాలేకపోయింది. కారణం.. కేంద్రప్రభుత్వం. 2014లో ఎన్నెన్నో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఎనిమిదిన్నరేండ్ల హయాంలో సామాన్యులు దినదినగండంగా బతుకీడుస్తున్నారు. ఆకలి కేకలు, కట్టలు తెంచుకొన్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, ఉపాధికల్పనలేమి, విద్య, వైద్య సేవల కొరత, అవినీతి, లింగ సమానత్వలేమి, ప్రజాస్వామ్య లక్ష్యాలకు విఘాతం ఇలా.. చెప్పుకొంటూ పోతే బీజేపీ హయాంలో అన్ని రంగాల్లో దేశం అథఃపాతాళానికి చేరుకొన్నది.
అన్నమో.. రామచంద్ర
ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ)లో భారత్ గత ఏడాది మరింతగా దిగజారింది. 121 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో 29.1 స్కోరుతో 107 స్థానానికి పరిమితమైంది. గత కొంతకాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, కడు పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో చిగురుటాకులా వణికిపోతున్న ఉక్రెయిన్ కంటే భారత్ దారుణమైన ర్యాంకులో ఉన్నది.
ధరల భారాన్ని మోయలేం
స్వతంత్ర భారతావనిలో ఇదివరకు ఎన్నడూ చూడనంతటి ద్రవ్యోల్బణాన్ని కిందటేడాది ప్రజలు చూశారు. వెయ్యి రూపాయలతో బయటకు వెళ్తే, ఒక గ్యాస్ సిలిండర్ కూడా కొనలేని పరిస్థితి దాపురించింది. గడిచిన 8 ఏండ్లలో వంటగ్యాస్ ధర 183 శాతం, పెట్రోల్ 53 శాతం, డీజిల్ 76 శాతం పెరిగింది. నిత్యావసరాలైన బియ్యం, వంటనూనె, పప్పులు, పాల ధర సరాసరి 300 శాతం పెరిగాయి. ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబానికి 2014లో వారానికి సగటున రూ. 1,008 ఖర్చు కాగా, ప్రస్తుతం ఇది 1,638కి ఎగబాకింది.
నిరుద్యోగం పైపైకి..
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ 2014లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ లెక్కన గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో 17 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అయితే, కేవలం 7 లక్షల ఉద్యోగాలనే కేంద్రం భర్తీ చేసింది. దేశంలో 85 కోట్ల మందితో కూడిన శ్రామిక శక్తి ఉన్నది. ఇందులో 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. కేంద్ర విభాగాల్లో 10 లక్షల ఖాళీలు ఉన్నాయంటూ ఒకవైపు కేంద్రమే పార్లమెంటులో చెప్తూ.. మరోవైపు భర్తీ ప్రక్రియను అటకెక్కించడంతో నిరుద్యోగిత రేటు పెరిగిపోతున్నది.
విద్య, వైద్యంలోనూ అంతే..
పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నతవిద్య ఆకాంక్షలపై కేంద్రం నీళ్లుచల్లుతున్నది. మైనారిటీ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు, ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరే విద్యార్థులకు ఫెలోషిప్లను రద్దు చేసింది. ఇక, దేశంలో వైద్యరంగం పరిస్థితి కూడా తీసికట్టుగానే ఉన్నది. దాయాది దేశం పాకిస్థాన్‌లో ప్రతీ వెయ్యి మంది పౌరులకు ఒక వైద్యుడు అందుబాటులో ఉంటే, మన దగ్గర రెండు వేల మందికి ఒక డాక్టర్ కూడా లేని దుస్థితి.