న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపర్చాలని ఈపీఎఫ్‌వో ఆఫీసర్ల సంఘం (ఈపీఎఫ్వోఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. ఈపీఎఫ్‌లో సమాచార సాంకేతిక వ్యవస్థలు, సాఫ్ట్వేర్, హార్ట్‌వేర్, ఐటీ మ్యాన్‌పవర్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నది.
ఐటీ వ్యవస్థలో లోపాల వల్ల ఈపీఎఫ్ సభ్యులతోపాటు ఈటీఎఫ్ సేవలపై కూడా ప్రభావం పడుతున్నదని తెలిపింది. ముఖ్యంగా ఈపీఎఫ్‌వో సేవలకు పునాది లాంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ తరచుగా మొరాయిస్తున్నదని వివరించింది. గత కొన్ని వారాల నుంచి ఈ అప్లికేషన్ చాలా నెమ్మదిగా పనిచేయడంతోపాటు కొన్నిసార్లు పూర్తిగా లాగౌట్ అయిపోతున్నదని పేర్కొన్నది.