ముంబై: ముంబైకి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలిని.. సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు. బెదిరింపులకు పాల్పడి ఆమె అకౌంట్ నుంచి సుమారు 3.71 కోట్లు కాజేశారు. డిజిటల్ అరెస్టుకు చెందిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అని చెప్పి సైబర్ నేరగాడు ఆ మహిళను మోసం చేశాడు. సీబీఐ, పోలీసు అధికారులమని ఆమెను నమ్మించారు. అంధేరీ ఈస్ట్‌లో ఆ బాధిత మహిళ 26 ఏళ్లుగా జీవిస్తోంది. ఆగస్టులో ఆమెకు తొలిసారి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులమని చెప్పి ఆమెతో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో వేర్వేరు నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చాయి.
ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు వీడియో కాల్లో ఆ బాధిత మహిళను ఓ వ్యక్తి బెదిరించాడు. ఆ అకౌంట్ ద్వారా సుమారు ఆరు కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు చెప్పాడు. అయితే తనకు బ్యాంక్ అకౌంట్ లేదని ఆమె చెప్పిన తర్వాత.. ఫేక్ పోలీసు ఫిర్యాదు ఫోటోలను ఆమెకు పంపారు. సీబీఐ లోగో ఉన్న డాక్యుమెంట్లను కూడా బాధిత మహిళకు మెసేజ్ చేశారు. ఈ విషయం గురించి ఫ్యామిలీలో ఎవరికీ చెప్పవద్దు అని , ఒకవేళ చెబితే వాళ్లను అరెస్టు చేస్తామని బెదిరించారు.
24 గంటల నిఘాలో ఉన్నట్లు ఆమెను బెదిరించారు. కేసు విచారణ చేపడుతున్నామన్నారు. ఇక ఆ తర్వాత ఓ వ్యక్తి వీడియో కాల్లో వచ్చి, తాను జడ్జి చంద్రచూడ్ అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను ప్రశ్నించాడు. బెయిల్ నిరాకరిస్తున్నట్లు ఆమెను బెదిరించాడు. దీంతో తన వద్ద ఉన్న డబ్బును డిపాజిట్ చేయాలని సైబర్ నేరగాళ్లు ఆమెను బెదిరించారు. మ్యూచువల్ ఫండ్స్ తీసి ఆ డబ్బును ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు. పోలీసుల తనపై చర్య తీసుకునే అవకాశం ఉందన్న భయంతో.. ఆమె సుమారు 3.71 కోట్ల డబ్బును బదిలీ చేసింది. మళ్లీ మళ్లీ డబ్బులు అడగడంతో ఆమె తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాటింగ్ లాగ్, కాల్ డిటేల్స్, ట్రాన్జాక్షన్ రికార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్లలను ఆమె పోలీసులకు సమర్పించింది.