India Debt | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు వందశాతం కూడా దాటిపోయే ప్రమాదం ఉన్నదని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే దీర్ఘకాలంలో దేశానికి ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరించింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పెట్టుబడులు స్థిరంగా పెరగాలని భారత్లో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ‘చారిత్రక అంశాలపరంగా చూసినా, దేశానికి పొంచి ఉన్న పర్యావరణ, ప్రకృతి విపత్తుల పరంగా చూసినా దీర్ఘకాలంలో భారత్కు అప్పుల ముప్పు అధికంగానే ఉందన్నదే ఐఎంఎఫ్ ఉద్దేశం. అయితే విదేశీ అప్పుల సమస్య తక్కువే.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగులుతున్న ఎదురుదెబ్బలను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు దేశీయ అప్పులు కూడా సమస్యగానే మారే అవకాశం ఉన్నది. భారత జీడీపీలో పబ్లిక్ రుణాలు 2005-06లో 84 శాతం ఉంటే.. 2021-22 నాటికి 81 శాతానికి తగ్గాయి. ఆ మేరకు విదేశీ అప్పులు పెరిగాయి’ అని ఐఎంఎఫ్ తన నివేదికలో వివరించింది. ఐఎంఎఫ్ నివేదికపై కేంద్రం స్పందించింది. విదేశీ రుణాలు తక్కువగా ఉన్నందున రుణ సమస్య పెద్దగా ఉండదని పేర్కొన్నది. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి. ఇది దేశ జీడీపీలో 57.1 శాతం. అదే కాలానికి అన్ని రాష్ర్టాల అప్పులు కలిపి జీడీపీలో 28 శాతానికి చేరాయి. దేశానికి అప్పుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత అక్టోబర్లో ప్రకటించారు.