రాంచీ : అక్రమ మైనింగ్ ద్వారా మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్నది. ఇవాళ ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈడీ ఆఫీసుకు వెళ్లడానికి ముందు ఆయన మద్దతుదారులతో మాట్లాడారు. సంపూర్ణ విచారణ తర్వాతనే విచారణ ఏజెన్సీలు ఒక అవగాహనకు రావాలని, సీఎంకు సమన్లు జారీ చేసిన విధానం సరిగా లేదని, తానేమీ ఈ దేశాన్ని విడిచి వెళ్లడం లేదని హేమంత్ సోరెన్ అన్నారు.
కేవలం వ్యాపారవేత్తలు మాత్రమే ఈ దేశాన్ని విడిచి వెళ్లారని, ఒక్క రాజకీయవేత్త కూడా దేశం విడిచి పారిపోలేదని అన్నారు. విపక్షాలు చేస్తున్న కుట్ర రాష్ట్రంలో అస్థిరతను క్రియేట్ చేస్తుందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కుట్రదారులు ఓ జలాంతర్గామిలా పనిచేస్తున్నారని, వాళ్లు పైకి తేలేందుకు భయపడుతున్నారని, కానీ ఆ సబ్‌మెరైన్ ఇప్పుడు పైకి తేలినట్లు ఆయన ఆరోపించారు.
అక్రమ మైనింగ్ కేసులో సోరెన్ అనుచరుడు పంకజ్ మిశ్రాతో పాటు బచ్చూ యాదవ్, ప్రేమ్ ప్రకాశ్‌లను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో సుమారు వెయ్యి కోట్ల మేర మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.