అహ్మదాబాద్ : రూ 1.6 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని అహ్మదాబాద్ పోలీసులు బుధవారం రామోల్ ప్రాంతంలోని కామధేను గ్రౌండ్లో ధ్వంసం చేశారు. ఈ మద్యాన్ని 2020, 2021లో అహ్మదాబాద్ పోలీస్ ఐదవ జోన్ బృందం సీజ్ చేసింది.
భద్రతా చర్యలు చేపడతూ అవసరమైన అనుమతులతో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని డీసీపీ అచల్ త్యాగి వెల్లడించారు. గత రెండేండ్లుగా 820 కేసుల్లో పెద్దసంఖ్యలో అక్రమ విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు.
కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత మద్యం బాటిళ్లను భారీగా ధ్వంసం చేయడం ఇదే తొలిసారి. భవిష్యత్‌లోనూ అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని త్యాగి తెలిపారు. మద్యం బాక్సులకు నిప్పంటించి బుల్డోజర్తో తొక్కించడంతో వేలాది మద్యం బాటిళ్లను నిమిషాల్లో ధ్వంసం చేశారు.