Maharashtra Elections | ముంబై, నవంబర్ 7( నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఎన్నికల వేళ నాసిక్ జిల్లాలో కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మాలెగావ్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులను యాజమానులుగా చూపుతూ నాసిక్ మర్చంట్ బ్యాంక్ మాలెగావ్ బ్రాంచ్‌లో వివిధ సంస్థల పేర్ల మీద బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు.
ఒక్కో ఖాతాలో రూ.10 కోట్లు, రూ.15 కోట్ల చెప్పున మొత్తం రూ.125 కోట్లు జమయ్యాయి. ఈ విషయం సదరు యువకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో సిరాజ్ అహ్మద్ అలియాస్ ఇస్మా అనే వ్యక్తి తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సంతకాలు తీసుకున్నాడని యువకులు తెలిపారు. దీంతో పోలీసులు సిరాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో అది హవాలా సొమ్ము అయి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.