ముంబై : మరికొద్ది నిమిషాల్లో వర్షం పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలియజేసే విధానాన్ని ఐఐటీ-బాంబే పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ సూచన వ్యవస్థ. ఇటువంటి మోడల్ మన దేశంలో ఇదే మొదటిది. ఇది వాతావరణ రాడార్లను విశ్లేషించి, వర్షం పడటానికి కనీసం 90 నిమిషాల ముందు హెచ్చరిస్తుంది. దీనిని ముంబైలోని కొలాబా ప్రాంతీయ వాతావరణ కేంద్రంలో అమర్చారు.
వచ్చే వారం నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ముంబైలో వర్షం కురిసే అవకాశం ఉంటే, 90 నిమిషాల ముందుగా అంచనా వేసి చెప్తుంది. Mumbaiflood.in వెబ్సైట్లో ఈ హెచ్చరికలను చూడవచ్చు. ఐఐటీ-బాంబేపోస్ట్ డాక్టొరల్ స్టూడెంట్ అక్షయ్ సునీల్ అభివృద్ధి చేసిన మోడల్ ఆధారంగా దీనిని తయారు చేశారు.
ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సుబిమల్ ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని గంటల క్రితం మేఘాల వరుసలు, వాతావరణ వ్యవస్థలను విశ్లేషించి, మరికొన్ని నిమిషాల్లో వర్షం పడే అవకాశం ఉందా? లేదా? అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది.