న్యూఢిల్లీ, జూన్ 1: మురుగు నీటితో గ్రీన్ ఎనర్జీని తయారు చేసే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అనే బయో ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన పరిశోధకులు.. దానితో పర్యావరణహిత శక్తిని తయారుచేయవచ్చని వెల్లడించారు.
భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పునరుత్పాదక శక్తి అవసరం ఎక్కువగా ఉంటుందని, దానికి తగ్గట్టుగా కొత్త సాంకేతికతలతో ఇంధన వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ ఎనర్జీ తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని ఐఐటీ గువాహటి డైరెక్టర్ టీజీ సీతారాం పేర్కొన్నారు.