న్యూఢిల్లీ, మార్చి 19 : కృత్రిమ మేథస్సు(ఏఐ) పరిశోధనకు మద్దతుగా తాను చదువుకున్న మాతృసంస్థకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి భారీ విరాళాన్ని అందించారు. ఏఐ టెక్నాలజీ రంగంలో ఐఐటీ-ఢిల్లీ చేస్తున్న అత్యాధునిక పరిశోధనకు మద్దతుగా పూర్వ విద్యార్థి, యార్డి సిస్టమ్స్ బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు అనంత్ యార్డి నుంచి రూ.75 కోట్లు విరాళంగా అందుకున్నామని వర్సిటీ అధికారులు గురువారం తెలిపారు. ‘జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొనడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధం చేసినందుకు, విద్యా పునాది అందించినందుకు ఐఐటీ-ఢిల్లీకి నేను చాలా కృతజ్ఞుడను’ అని యార్డీ తాజాగా స్పందించారు.
1968 బ్యాచ్ పూర్వ విద్యార్థి యార్డి(79) , గతంలోనూ తన మాతృ సంస్థకు రూ.75 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీంట్లో గణనీయమైన భాగాన్ని ఐఐటీ-ఢిల్లీ ‘యార్డి స్కూల్ ఆఫ్ ఏఐ’ కోసం కేటాయించారు. మరికొంత మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, విస్తరణకు ఖర్చు చేశారు. యార్డి స్కూల్ ఆఫ్ ఏఐ.. కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్‌లో విద్య, పరిశోధనలను అభివృద్ధి చేయడానికి అంకితమైంది.