మేరీలాండ్, ఆగస్టు 19: ప్రభుత్వ పత్రాలను బహిరంగం కాకుండా దాచేందుకు, ప్రభుత్వ రికార్డుల చట్టాలను తప్పించేందుకు కుట్ర చేసినట్టు అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ మాజీ సలహాదారు కోర్టులో నేరాన్ని అంగీకరించారు. ప్రజా రికార్డుల చట్టాలను తప్పించుకోవడానికి, గ్రాంట్ పరిశోధన నిధులు, కొవిడ్ మహమ్మారికి సంబంధించిన ప్రభుత్వ పత్రాలను దాచిపెట్టడానికి కుట్ర పన్నినట్టు ఆంథోనీ ఫౌచీ మాజీ సలహాదారుగా పనిచేసిన డేవిడ్ మోరెన్స్.
మంగళవారం మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్ ఫెడరల్ కోర్టులో నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ ఆరోపణలు కనుక రుజువైతే నవంబర్ 12న ఆయనకు ఐదేండ్ల పాటు శిక్షను విధించే అవకాశం ఉంది. ‘ఈ రోజు నేరాన్ని అంగీకరించడం ద్వారా డాక్టర్ మోరెన్స్ తాను చేసిన పనికి బాధ్యత వహించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తారు’ అని ఆయన న్యాయవాది టిమోటీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాపై ప్రమాదకర పరిశోధనలకు గాను చైనాలోని వూహాన్ పరిశోధనశాలకు అగ్రరాజ్యం అమెరికా నుంచి నిధులు అందాయని, ఆ వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన నిజాలను కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి.