సిటీబ్యూరో, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ) : క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధి ప్రజలపై అదనపు భారాలను మోపే చట్టానికి లైన్ క్లియర్ అయింది.. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భా రీగా పెంచేసింది. సొం తింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ల భారం ఇప్పటికే నడ్డి విరిచింది.. ఆ భారం నుంచి కోలుకోకముందే త్వరలో ట్రై కార్పొరేషన్లలో ఒకే ఆస్తి పన్ను విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీలో క్యూర్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ 1955 స్థానంలో క్యూర్ -2026 చట్టం అమల్లోకి రానుంది.
ఒకే నగరం.. ఒకే పరిపాలన, ఒకే చట్టం లక్ష్యంతో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల పరిధిలో వర్తించేలా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు, అదనపు అధికారాలు లభించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ట్రై కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేడెట్ గవర్నెన్స్) బిల్లు -2026 క్యూర్ బిల్లు అమల్లోకి వస్తే గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల మంది ఆస్తిపన్ను యజమానులపై పన్నుల భారం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు వాటి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి వచ్చే అద్దె ఆధారంగా నామమాత్రంగా పన్నులు విధిస్తున్నారు. కానీ కొత్త విధానం ప్రకారం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ విలువ లేదా మారెట్ రేట్ల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు.
ఉదాహరణకు, ఐటీ కారిడార్, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒక సాధారణ ఇంటి మారెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వల్ల ఆ భారీ ‘క్యాపిటల్ వ్యాల్యూ’పై పన్ను లెకగడితే, ఏటా కట్టే ఆస్తి పన్ను భారం ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఇటు సొంత ఇల్లు ఉన్న వారు, అటు అద్దె ఇళ్లల్లో ఉండే సామాన్యులు కూడా పెరగబోయే అద్దెల భారాన్ని తలచుకుని గుండెలు బాదుకునే పరిస్థితి రాబోతుండడం గమనార్హం. కాగా సెక్షన్ 237 ప్రకారం ప్రతి ఏటా నీటి సరఫరా, మరుగునీటి (సీవరేజ్) పన్నులను ఆటోమేటిక్గా 5శాతం చొప్పున పెంచే నిబంధన సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మారనుంది. అక్రమ నిర్మాణాలపై 300శాతం వరకు పెనాల్టీలు విధించే నిబంధన అక్రమాలను అరికట్టడానికి కాకుండా, కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంది.