మహబూబాబాద్ రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 19 : పాలిటెక్నిక్ విద్యను తక్కువ చేసే జీవో 97ను రద్దు చేయాలని బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్‌లో కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. కలెక్టర్‌ను కలవాలని విద్యార్థులు గేటు ఎక్కి లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘం నాయకుల మ ధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి విద్యార్థుల గొంతు నొక్కడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. దీనిని నిరసిస్తూ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కు మా ర్, కోశాధికారి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యలో నూతనంగా తీసుకొచ్చిన జీవో 97 వల్ల తీవ్ర ఇబ్బందు లు ఎదురవుతున్నాయని అన్నారు. డిప్లొమా కోర్సులను, ఐటీఐ, ఐటీసీలకు అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందన్నారు. సర్కారు వెంటనే జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎమ్మెల్యే, ఎంపీల ఇండ్ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
అలాగే జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో విద్యార్థులు ర్యాలీ చేపట్టి శివునిపల్లిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నాలుగు రోజులుగా తరగతులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గంటకు పైగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. మహబూబాబాద్‌లో డీఎస్ఎఫ్ఐ నాయకులు దేవేందర్, శివ, జవహర్, అభిరామ్, భరత్, తరుణ్, సంతోష్, అజయ్ పాల్గొన్నారు.
పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి
మహబూబాబాద్, (నమస్తే తె లంగాణ) : విద్యార్థులపై క్రూరంగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై చర్య తీసుకోవాలి. జీవో-97ను వెంటనే రద్దు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదు. విద్యార్థులు తమ హకుల కోసం రోడ్డెకితే కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే దాడి చేయడం, నిరసన తెలిపితే అణచివేయడం ఏమిటి? విద్యార్థులపై పోలీసు దమనకాండను తక్షణమే నిలిపివేయాలి. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిషరించాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. విద్యార్థుల గొంతు నొకడం కాదు.. వారి సమస్యలను పరిషరించడం ప్రభుత్వ బాధ్యత.
– సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి