న్యూఢిల్లీ, ఆగస్టు 19: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)లో చేరి ఎన్డీయేలో భాగం కావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కేంద్ర మంత్రి రాందాస్ అథావలే ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో అథావలేకు చెందిన ఆర్పీఐ(ఏ) భాగస్వామిగా ఉంది.
అయితే ఈ ఆహ్వానంపై దీప్కే ఘాటుగా స్పందించారు. కేవలం నెల రోజుల క్రితం దేశ వ్యతిరేకిగా ముద్ర వేసిన తనను ఇప్పుడు ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని దీప్కే ప్రశ్నించారు. ఈనెల 17న విలేకరులతో అథావలే మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కలను సాకారం చేయడానికి, సమాజాన్ని బలోపేతం చేయడానికి దీప్కే తన పార్టీలో చేరే విషయాన్ని పరిశీలించాలని కోరారు. దీప్కే ఒక అంబేద్కర్ వాది అని తాను భావిస్తున్నానని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని నమ్మే ప్రభుత్వం తమది కాబట్టి అధికార పక్షంలో ఆయన చేరాలని అథావలే అన్నారు.