న్యూఢిల్లీ : ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చనే ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓడిపోయినప్పుడే ఈవీఎంల ట్యాంపర్ గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం విచారించింది. పాల్ స్వయం గా హాజరై వాదనలు వినిపించారు. ఓడినప్పుడే ఈవీఎంలు ట్యాం పరి ంగ్ అయ్యాయని ఆరోపిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసిన అభ్యర్థులను కనీసం ఐదేండ్లు అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ తన పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘మీ దగ్గర చాలా ఆసక్తికర వ్యాజ్యాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి?’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ వ్యాజ్యాన్ని కొట్టేసింది.