Supreme Court | వైమానిక దళంలో మహిళలు రఫేల్ లాంటి యుద్ధ విమానాలను నడుపుతున్నారని.. వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సైన్యంలోని జడ్జి, అడ్వకేట్ జనరల్, లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఆ పోస్టులకు స్త్రీ-పురుష నిష్పత్తి వర్తించదని నిబంధనలు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుసరించడం లేదంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం సమాధానం కోరింది. సైన్యంలోని జడ్జి, అడ్వకేట్ జనరల్, లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము నాలుగు, ఐదో ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న పురుష అధికారులను నియమించారని.. ఈ విభాగంలో ఆరు పోస్టులు మాత్రమే విడుదలయ్యాయని, అందులో మహిళల కోటాలో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు పిటిషన్లపై విచారణ జరిపింది సర్వేన్నత న్యాయస్థానం. ఇద్దరు అధికారుల పిటిషన్‌పై ఈ నెల 8న విచారించిన సమయంలోనూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచ్‌లలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో కష్టం ఏంటీ అని సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భాటిని ప్రశ్నించారు. స్త్రీ, పురుష భేదంతో సంబంధం లేకుండా అవి తటస్థ పోస్టులను కేంద్రం చెప్పగా.. మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులను కేటాయించడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. స్త్రీ, పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడం కాదని.. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వడమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై తుది తీర్పును రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వం సమాధానం విన్న తర్వాత తీర్పును వెలువరించనున్నది.