Justice Chandru : ‘తమిళనాడు ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ (MK Stalin) ను విద్యార్థినీ, విద్యార్థులు ‘అప్పా’ (నాన్నా) అని పిలిస్తే తప్పేంటి..’ అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు (Justice Chandru) ప్రశ్నించారు. చెన్నైలో స్టాలిన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహార పథకం అమలు చేయాలని గతంలో తాను పలువురు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశానని, వారంతా నిధుల కొరత పేరుతో, నిధులు సమకూర్చినా అమలు కష్టసాధ్యమనే సాకుతో పట్టించుకోలేదని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బడి పిల్లలకు ఉదయం అల్పాహార పథకాన్ని స్టాలిన్ సమర్థవంతంగా అమలు చేసి పలువర్గాల ప్రశంసలు అందుకున్నారని ప్రశంసించారు. ఉదయం అల్పాహారంతో తమ ఆకలి తీర్చుతున్నందుకు బడిపిల్లలు, తమ ఉన్నత చదువులకు ప్రతినెలా తమ బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేస్తున్నందుకు కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రి స్టాలిన్ను అప్పా (నాన్నా) అని పిలవటం సమంజసమేనని, తప్పేముందని జస్టిస్ చంద్రు ప్రశ్నించారు.
కొంతమంది నేతలకు అప్పా అనే పిలుపు వింటేనే మంటగా ఉందని, ఇలాంటి నేతలు స్టాలిన్ను ఏ విధంగా సంబోధించినా పరవాలేదని జస్టిస్ చంద్రు అన్నారు. భావిభారత పౌరులైన విద్యార్థులు తమకు నచ్చిన విధంగా సంబోధించడాన్ని ఎవరూ అడ్డుకోకూడదని చెప్పారు.