న్యూఢిల్లీ: ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Army chief Dwivedi) తెలిపారు. ఆధునిక యుద్ధ రీతుల్లో ఆరితేరేందుకు త్రివిధ దళాలు సన్నద్దం అవుతున్నాయని ఆయన అన్నారు. భూమి, ఆకాశం, సముద్రంలో అత్యాధునిక రీతిలో సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు చెప్పారు. పుణెలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉద్రిక్తల పరిస్థితులు తాత్కాలికంగా అదుపులో ఉన్నా.. కానీ రాబోయే దశకు చెందిన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు భీకరంగా రెఢీ అవుతున్నట్లు ఆయన చెప్పారు.
భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు కేవలం సంప్రదాయ రీతికే పరిమితం కావు అని, సైబర్.. ఎలక్ట్రోమ్యాగ్నటిక్, కాగ్నిటివ్ డోమెయిన్లలోనూ యుద్ధ ప్రభావం ఉంటుందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన సత్తా చాటిందన్నారు. సైనిక దళాలు చాలా కచ్చితత్వంతో అటాక్ చేయగలవని నిరూపించామన్నారు. యుద్ధ క్షేత్రంలో జరుగుతున్న మార్పుల పట్ల ఆర్మీ జాగృతతో ఉందని, భవిష్యత్తుకు తగ్గట్లుగా అన్ని దళాలు ఆధునిక విధానంలో సమాయత్తం అవుతున్నాయని అన్నారు. మార్పుల్లో భాగంగా దివ్యాస్త బ్యాటరీలు, శక్తిమాన్ రెజిమెంట్స్, భారత్ బెటాలియన్స్తో పాటు ఇతర టెక్నాలజీ ఆధారిత సైన్యాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అన్ని అకాడమీల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ జరుగుతోందన్నారు. ఎన్డీఏ శిక్షణా కేంద్రంలో భారీ డ్రోన్లు, సిములేటర్లతో ఎన్డీఏ క్యాడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంలోనూ ముందంజలో ఉన్నట్లు జనరల్ ద్వివేది తెలిపారు. ఓఓడీఏ.. అబ్జర్వ్, ఓరియంట్, డిసైడ్, యాక్ట్ చక్రాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏఐ ఆధారిత సేవల వినియోగాన్ని పెంచుతున్నట్లు చెప్పారు.