చెన్నై: దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు బీజేపీ సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని నామకరణం చేసినప్పటి నుంచి బీజేపీ నేతలు ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిపై ఎలా దాడి చేయాలనే విషయంలో వాళ్లకు ఎటూ పాలు పోవడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్‌గా మార్చాలంటూ బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక స్పందనగా తాను భావిస్తున్నానని ఝా చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఇండియా అనే పదానికి అర్థం భారత్ అని చెబుతోందని, అలాంటప్పుడు ఇండియా అనే పదాన్ని పూర్తిగా తొలగించి భారత్ అనే పదం పెట్టడం దేనికని మనోజ్ ఝా ప్రశ్నించారు. ఒకవేళ ఇండియా కూటమి పేరును భారత్‌గా మార్చుకుంటే బీజేపీ సర్కారు ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ఆయన వెటకార వ్యాఖ్యలు చేశారు.