న్యూఢిల్లీ: జాతీయ రహదారుల అభివృద్ధి కోసం సేకరించిన భూమిని ఐదేళ్లపాటు వినియోగించకపోతే, దానిని తిరిగి యజమానికి ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఉన్నతాధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారుల చట్టాన్ని ప్రభుత్వం సవరించబోతున్నది. ఈ చట్టం ప్రకారం భూమిని సేకరించినపుడు, దానిని వినియోగించకపోతే, డీనోటిఫై చేయడానికి తగిన నిబంధన లేదు.
అందుకే దీనిని సవరించి, డీనోటిఫై చేయడానికి ఓ నిబంధనను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సవరణ కేంద్ర మంత్రివర్గానికి, ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లబోతున్నది. జాతీయ రహదారుల కోసం భూ సేకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.