Telangana | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘మాకూ కావాలి రైతుబంధు పథకం.. మాకూ ఇవ్వాలి పెట్టుబడి సాయం’… అంటూ తమిళనాడు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తమిళనాడు రైతు దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాకేంద్రంలో తమిళ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో రైతుబంధు, రైతుబీమా పథకాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ తెలంగాణ సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, పూర్తి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణకు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కొలువున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేశారని విమర్శించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతుల జీవితాలను మెరుగుపరచడం కోసం అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. వ్యవసాయదారుల కోసం అనేక మౌలిక వసతులు సమకూర్చడంతోపాటు పెట్టుబడి సహాయం, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్నదంటూ కొనియాడారు. రైతులు పండించిన పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు భరోసా ఇస్తుందంటూ ప్రశంసించారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు అందుకొని దేశ రైతాంగం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి దన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో తమిళ్ వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కేఎం రామ గౌండర్, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కురుబురు శాంతాకుమార్ తదితరులు పాల్గొన్నారు.