న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్ నుంచి రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విద్యుత్తు కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్ను విధించినా, అంతర్రాష్ర్టాల మధ్య జరిగే విద్యుత్తు సరఫరాకు అవరోధం కలిగించినా, విద్యుత్తు టారిఫ్‌కు సంబంధించిన సబ్సిడీ బకాయిలు చెల్లించకపోయినా ఆయా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు కేటాయించబోమని కేంద్రం స్పష్టంచేసింది.
అలాగే రెగ్యులేటరీ ఆస్తులు కలిగి ఉన్న రాష్ర్టాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు కేటాయింపు ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ తెలిపింది. తాము వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలు, తాము కొనుగోలు చేస్తున్న విద్యుత్తు కొనుగోలు ధరతో సరిపోలడం లేదని పంపిణీ సంస్థలు భావిస్తాయో అప్పుడు రెగ్యులేటరీ ఆస్తులు ఉనికిలోకి వస్తాయని తెలిపింది.
అయితే కేంద్ర విద్యుత్తు తయారీ సంస్థల నుంచి కేటాయింపు కోటా లేకపోయినా సరఫరా చేయాలంటూ ఆయా రాష్ర్టాల నుంచి వచ్చే వినతులను పరిశీలిస్తామని పేర్కొన్నది. వినియోగదారుడి టారిఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వపు సబ్సిడీ ఏమైనా ఉంటే దానిని క్రమం తప్పక చెల్లిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామంది.