పట్నా: యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్-1 (యూపీఏ-1) హయాంలో రైల్వే శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి సీబీఐ అధికారులు మరోసారి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే లాలూను విచారించి దర్యాప్తు ముగించిన అధికారులు మరోసారి కేసును రీఓపెన్ చేస్తున్నారు. ఈ మేరకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు నోటిసులు ఇచ్చారు.
దీనిపై లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వియాదవ్ తనదైన శైలిలో స్పందించారు. సీబీఐ అధికారులు ఒకసారి ఈ కేసులో దర్యాప్తు చేపట్టి ఎలాంటి అవినీతిని నిరూపించలేకపోయారని, ఇప్పుడు మరోసారి కేసును తిరగదోడుతున్నారని ఆరోపించారు. తన తండ్రి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు కావాలనుకుంటే మా ఇంట్లోనే ఆఫీస్ తెరుచుకుని, మమ్ములను రోజూ విచారించవచ్చని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.