బెంగళూరు : రేడియేషన్ లేకుండా, సురక్షితంగా కణుతులను గుర్తించే ఇమేజింగ్ మాలిక్యూల్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మానవ శరీరానికి హాని చేయదని, చౌకగా అందుబాటులో ఉంటుందని వీరు చెప్పారు. ఈ కొత్త విధానం ఖరీదైన పీఈటీ స్కాన్స్కు బదులుగా అందుబాటులోకి వస్తుందన్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగ నిర్ధారణ తక్కువ వనరులతోనే చేరువవుతుందని తెలిపారు. ఈ అధ్యయన నివేదికను జేఏసీఎస్ ఏయూ ప్రచురించింది. ఐఐఎస్సీలోని బయోఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయన నివేదిక కరస్పాండింగ్ ఆథర్ సంహిత సిన్హరే మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో, పీఈటీ, ఎంఆర్ఐల కన్నా చౌక ధరలో, ఆ పరీక్షల ద్వారా తెలుసుకోగలిగిన సమాచారాన్ని తాము అభివృద్ధి చేసిన విధానం ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు.
కణుతులు (ట్యూమర్లు)ను గుర్తించడానికి పొసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పీఈటీ) అత్యున్నత స్థాయి ప్రామాణికమైనది. పీఈటీ స్కాన్స్ తీసేటపుడు 18ఎఫ్-ఎఫ్‌డీజీ వంటి రేడియోయాక్టివ్ గ్లూకోజ్ ట్రేసర్స్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇవి కణితి ఉన్న ప్రదేశంలో పోగుపడతాయి. స్కానింగ్ చేసేటపుడు ఆ ప్రదేశాలను ప్రకాశవంతంగా చేస్తాయి. అయితే, పీఈటీ చాలా ఖరీదైనది. అంతేకాకుండా, దీనివల్ల రేడియేషన్ ముప్పు ఉంటుంది.
జీవ వ్యవస్థకు బయట జీపీసీ అనే అణువు (మాలిక్యూల్)ను ఐఐఎస్సీ టీమ్ రూపొందించింది. ఇది సున్నితత్వం, వైవిధ్యాలను నాటకీయంగా పెంచగలదు. దీనివల్ల ట్యూమర్‌ను సులువుగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఆరోగ్యానికి ముప్పు లేకుండానే మళ్లీ మళ్లీ స్కాన్స్ తీయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం ప్రయోగశాల అధ్యయనాల్లో ఉంది. దీనిపై మరింత క్లినికల్ ట్రయల్స్ అవసరం.
ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త విధానం పీఏ ఇమేజింగ్. దీనిలో రేడియేషన్‌ను వినియోగించరు. శరీరంలోని వైవిద్ధ్యంతో కూడిన అణువులను ప్రకాశింపజేయడానికి నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్‌ను ఈ విధానంలో ఉపయోగిస్తారు. ఈ అణువులు (మాలిక్యూల్స్) శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. ట్యూమర్ ఇమేజెస్‌ను రూపొందించడానికి ఈ శబ్ద తరంగాలు ఉపయోగపడతాయి.