ICRA | పశ్చియాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ప్రవేశించి అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకోగా.. ఇది భారత జీడీపీని ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేసింది. వాస్తవానికి అమెరికా దాడుల తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ముడి చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే.. భారతదేశ నికర చమురు దిగుమతులు దాదాపు 13 నుంచి 14 డాలర్లకు వరకు పెరుగుతాయని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ఫలితంగా భారతదేశ కరెంట్ ఖాతా లోటు (CAD) జీడీపీలో 0.3 శాతం పెరుగుతుంది. కరెంట్ ఖాతా లోటు అనేది ఒక దేశ కరెంట్ ఖాతాలో దిగుమతులు-ఎగుమతుల మధ్య అసమతుల్యతను సూచిస్తుంది. ఎగుమతుల కంటే దిగుమతులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఎదురవుతుంది.
2026 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్కు 80 నుంచి 90 డాలర్ల వరకు పెరిగితే.. కరెంట్ కాతా లోటు ప్రస్తుత జీడీపీ అంచనా నుంచి జీడీపీలో 1.5 నుంచి 1.6 శా వరకు పెరిగే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఈ వివాదం జూన్ 13న మొదలైందని నివేదిక తెలిపింది. ఆ తర్వాత ముడి చమురు ధర బ్యారెల్కు 64 నుంచి 65 డాలర్లుగా ఉన్న ధర 74 నుంచి 75 డాలర్ల వరకు పెరిగింది. అమెరికా రంగ ప్రవేశంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయనున్నట్లు ప్రకటించింది. దాంతో ప్రపంచ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే కీలకమైన సముద్రమార్గాల్లో ఒకటి. దాదాపు 20 మిలియన్స్ బ్యారెల్స్ ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) మూడో వంతు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఈ జలసంధి దాదాపు 30 మైళ్ల వెడల్పు ఉంటుంది. ఇరాన్-ఒమన్ మధ్య ఈ జలసంధి ఉంటుంది.
అయితే, చమురు ధరల పెరుగుదల ప్రభావం దిగుమతులకే పరిమితం కాదని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ఇది టోకు ధరల సూచిక (WPI)లో 80 నుంచి 100 బేసిస్ పాయింట్లు, వినియోగదారుల ధరల సూచిక (CPI)లో 20 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెరిగేందుకు పరిస్థితులు దారి తీయవచ్చని చెప్పింది. భారత్ ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. భారతదేశ ముడి చమురులో దాదాపు 45 నుంచి 50 శాతం వరకు హర్మూజ్ జలసంధి ద్వారా వస్తుంది. నేచురల్ భారత్ సహజవాయువులో 54శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ఎల్ఎన్జీలో ఎక్కువ భాగం ఖతార్, యూఏఈ నుంచి దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో ఈ మార్గంలో సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.