కోటా: రాజస్థాన్‌లో ఓ బ్యాంకు మేనేజర్.. కస్టమర్లకు సుమారు 4 కోట్ల మేర మోసం చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమర్ల ఎఫ్‌డీల్లో(Fixed Deposits) ఉన్న డబ్బును తీసి.. అధిక వడ్డీల కోసం స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టింది. సుమారు 41 మంది కస్టమర్లకు చెందిన సొమ్మును ఈ విధంగా దారి మళ్లించింది. రెండేళ్ల పాటు ఆమె ఈ రకమైన ఫ్రాడ్‌కు పాల్పడింది. బ్యాంకులో ఎవరికీ తెలియకుండానే ఆమె తతంగం నడిపించింది.
వివరాల్లోకి వెళ్తే… సాక్షీ గుప్తా.. ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్‌గా పని చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లకు చెందిన యూజర్ ఎఫ్డీ లింకును దుర్వినియోగం చేసి.. అక్రమ రీతిలో ఆమె 41 మంది కస్టమర్లకు చెందిన 110 అకౌంట్ల నుంచి సుమారు 4.58 కోట్ల డబ్బును లాగేసింది. 2020 నుంచి 2023 మధ్య ఈ ఫ్రాడ్ జరిగింది. దర్యాప్తులో కొన్ని విషయాలు తెలిశాయి. ఆ డబ్బును ఆమె స్టాక్ మార్కెట్లో పెట్టినట్లు తెలిసింది. అక్రమ రీతిలో ఎఫ్‌డీల నుంచి తీసిన డబ్బును తిరిగి కస్టమర్ల అకౌంట్లలో క్రెడిట్ చేయడంలో ఆమె విఫలమైంది. మార్కెట్లలో నష్టం రావడం వల్ల ఆమె చేతులెల్తేసింది. ప్రస్తుతం సాక్షీ గుప్తాను అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీలోకి పంపారు.
తన ఎఫ్డీ గురించి ఓ కస్టమర్ బ్యాంకుకు వెళ్లి అడగ్గా ఈ ఉదంతం బయటపడింది. ఫిబ్రవరి 18వ తేదీన ఆ బ్యాంకు కేసు బుక్ చేసింది. కస్టమర్ అకౌంట్లకు లింకై ఉన్న ఫోన్ నెంబర్లను మార్చి.. ఆ మేనేజర్ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. లావాదేవీలకు చెందిన మెసేజ్‌లు కస్టమర్లకు చేరకుండా ఆమె ఫోన్ నెంబర్లను మార్చింది. కుటంబసభ్యుల ఫోన్ నెంబర్లు పెట్టి.. 4 కోట్లు కాజేసిందామె. డబ్బులు తీస్తున్న సమయంలో ఓటీపీ రాకుండా కూడా తన వద్ద ఉన్న సిస్టమ్‌లో మార్పులు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఘటనపై ఇంకా ప్రకటన చేయలేదు. కానీ నష్టపోయిన కస్టమర్లకు పరిహారం ఇవ్వనున్నట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించినట్లు తెలుస్తోంది.