HAL | బెంగళూరు, ఫిబ్రవరి 11: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేస్తున్న తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల ఆలస్యంపై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓ యుద్ధవిమానాన్ని పరిశీలిస్తూ.. హెచ్ఏఎల్ అధికారులతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది.
‘ఫిబ్రవరి నాటికి 11 యుద్ధవిమానాలు తయారవుతాయని నాకు హామీ ఇచ్చారు. ఇప్పటికి ఒక్కటి కూడా తయారుకాలేదు. హెచ్ఏఎల్ మన సొంత సంస్థ. నేను కూడా ఇందులో పని చేశా. కానీ ఇక్కడ పనులు యుద్ధప్రాతిపదికన జరగడం లేదు. ఇప్పుడైతే నాకు హెచ్ఏఎల్పై నమ్మకం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు వీడియోలో కనిపిస్తున్నది. కాగా, 2010లో ఆర్డర్ ఇచ్చిన 40 తేజస్ ఎంకే1 యుద్ధవిమానాలు ఇప్పటికీ పూర్తిగా తమకు అందలేదని ఇటీవల ఏపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.