Operation Sindoor | న్యూఢిల్లీ, మే 8: ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్‌తో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులలో ఒకరైన గ్రూపు కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను వెంటనే తిరిగి రావాలని ఐఏఎఫ్ ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సదస్సులో పాల్గొంటున్న కృష్ణన్‌కు వెనక్కి తిరిగి రావాలని ఐఏఎఫ్ నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుత పరిస్థితి ఏమిటో మీకు తెలుసునని ఆయన విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.
2027 ప్రారంభంలో ప్రయోగించనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్రలో ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపనున్నారు. కృష్ణన్‌తోపాటు సహచర వ్యోమగామి అంగద్ ప్రతాప్ భారత్‌లో శిక్షణ పొందుతున్నారు. ఇతర బృంద సభ్యులు సుభాంశు శుక్లా, ప్రశాంత్ బీ నాయర్ వచ్చే ఆక్జియం -4 మిషన్ కోసం అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. 2003లో ఐఏఎఫ్‌లో చేరిన కృష్ణన్ టెస్ట్ పైలట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విశేష అనుభవం ఉంది. ఎస్‌యూ-30, మిగ్-29 వంటి యుద్ధ విమానాలు నడపడంలో దాదాపు 2,900 గంటల అనుభవం ఆయనకు ఉంది.