Rafale Fighter Jets | న్యూఢిల్లీ, జూలై 23: రఫెల్ యుద్ధ విమానానికి ‘ఆస్ట్రా ఎయిర్’ వంటి దేశీయంగా తయారు చేసిన క్షిపణులను అనుసంధానించేలా నిర్మాణంలో మార్పులు చేయాలని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్‌ను కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. తద్వారా రఫెల్ యుద్ధ విమానాలను శత్రుభీకరంగా రూపొందించడంతో పాటు స్వదేశీ ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడుతుందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. కేవలం డీఆర్డీవో అభివృద్ధి చేసిన క్షిపణులు, బాంబులు మాత్రమే కాకుండా పలు ప్రైవేటు సంస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణులను కూడా భవిష్యత్తులో రఫెల్ యుద్ధ విమానాలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.