చెన్నై: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపడానికి గడువును నిర్ణయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీని కోసం రాజ్యాంగంలోని అధికరణ 200ను సవరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన సమాధానాల ప్రభావం గురించి స్టాలిన్ ప్రస్తావించారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపకుండా, నిలిపి ఉంచిన బిల్లులు గవర్నర్ ఆమో దం పొందినట్లుగా పరిగణింపబడతాయని 2025 ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన సమాధానాల ప్రభావం ఏమీ ఉండదని చెప్పారు.
రాష్ట్ర హక్కులు, నిజమైన సమాఖ్యతత్వం కోసం డీఎంకే పోరాటం కొనసాగుతుందన్నారు. గవర్నర్ రవి చెప్పిన ‘పాకెట్ వీటో’ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. తమ న్యాయ పోరాటం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అనుగుణంగా గవర్నర్లు పని చేసేలా చేయగలిగామని తెలిపారు.