కోల్‌కతా: ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను ఆమోదించినట్టు భావించవద్దని, ఈ మాటలను అన్నందుకు తనను జైలుకు కూడా పంపవచ్చని, అయినప్పటికీ తాను లెక్క చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నగరంలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో సోమవారం సమావేశమైన టీచర్లను ఉద్దేశించి మమత ప్రసంగించారు. గత వారం 25,000 మందికిపైగా టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ తాను బతికి ఉండగా అలా జరగనివ్వనని మమత ప్రకటించారు.
ఈ సందర్భంగా అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను ఆమె ఉదహరిస్తూ ఆ కేసులో సుప్రీంకోర్టు మొత్తం పరీక్షను రద్దు చేయలేదని గుర్తు చేశారు. ‘ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో సుప్రీంకోర్టు తేల్చాలి. మాకు జాబితా ఇవ్వండి. విద్యా వ్యవస్థను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్‌లో చాలా మంది మరణించారు. వారికిప్పటికీ న్యాయం లభించలేదు. నీట్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు పరీక్షను రద్దు చేయలేదు. బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బెంగాల్ ప్రతిభను చూసి మీరు భయపడుతున్నారు’ అని బీజేపీ, సీపీఎంలను ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తమకు స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో తామే వేరే మార్గాన్ని ఎంచుకుని ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బందికి అండగా ఉంటామని ఆమె చెప్పారు.