న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభ స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రతిపక్షాలు మంగళవారం నోటీసును సమర్పించాయి. సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని, తన రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంతేగాక కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని కూడా విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా వివిధ ప్రతిపక్షాల తరఫున లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగొయ్, చీఫ్ విప్ కే సురేశ్, విప్ మహ్మద్ జావేద్ రాజ్యాంగంలోని 94 సీ అధికరణ కింద లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌కి నోటీసు అందచేశారు.
కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, ఆర్జేడీ, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 120 మంది విపక్ష ఎంపీలు నోటీసుపై సంతకం చేశారు. నోటీసుపై టీఎంసీ ఎంపీలు సంతకం చేయలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కూడా నోటీసుపై సంతకం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులను సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడం లేదని, పార్లమెంట్లో మాట్లాడడం వారి మౌలిక ప్రజాస్వామిక హక్కని తమ నోటీసులో విపక్ష ఎంపీలు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతించలేదని కూడా వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒక్క ఉదంతమే కాదని, లోక్‌సభలో రాహుల్ మాట్లాడేందుకు స్పీకర్ ఎన్నడూ అనుమతించలేదని వారు ఆరోపించారు. ఫిబ్రవరి 3న ఏకపక్షంగా 8 మంది విపక్ష ఎంపీలను మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని, తమ ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకున్నందుకు వారిని శిక్షించారని నోటీసులో పేర్కొన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సమర్పించిన నోటీసులో తప్పు దొర్లింది. నోటీసులో 2026 సంవత్సరానికి బదులుగా 2025 అని తప్పుగా రాశారు. అలా ఒకచోట కాకుండా మొత్తం నోటీసులో అనేక చోట్ల 2026కి బదులుగా 2025 అని విపక్షాలు రాసుకొచ్చాయి.
తన తొలగింపును కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం, చర్చ చేపట్టేంత వరకు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం అటువంటి అవసరం లేనప్పటికీ సభకు హాజరుకారాదని ఆయన నిర్ణయించుకున్నారు. సభకు హాజరుకావాలని ప్రభుత్వం లేదా విపక్షం నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన భావిస్తున్నారు. మార్చి 9న బడ్జెట్ సమావేశాల రెండవ భాగం మొదటి రోజునే స్పీకర్‌పై విపక్ష ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తీర్మానం ఆమోదం పొందాలంటే 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. వారు చేతులెత్తి మద్దతు ప్రకటించిన తర్వాత తీర్మానంపై చర్చకు సభాపతి అనుమతినిస్తారు. తన తొలగింపును కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టినపుడు సభలో ఉన్నప్పటికీ స్పీకర్ సభాధ్యక్ష స్థానంలో కూర్చోడానికి వీల్లేదు. అయితే చర్చలో పాల్గొని తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశం స్పీకర్‌కు ఉంటుంది. విపక్ష ఎంపీలు సమర్పించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను స్పీకర్ ఓంబిర్లా ఆదేశించారు.