కోల్‌కతా: మణిపూర్‌లో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుకరిస్తున్న వైఖరిని ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పలు ప్రశ్నలు సంధించారు.
‘ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. మణిపూర్‌లో వెలుగుచూసిన దారుణ సంఘటన మీకు కొంచమైనా బాధ కలిగించలేదా..? మీరు బెంగాల్‌ను వేలెత్తి చూపుతున్నారు. కానీ మణిపూర్‌లో హింసకు గురవుతున్నా చెల్లెల్లు, తల్లులపై మీకు ప్రేమ లేదా..? ఇంకా ఎన్నాళ్లు మణిపూర్‌లో ఆడబిడ్డలు తగులబడాలి..? ఇంకా ఎప్పటిదాక దళిత, మైనారిటీలు హత్యలకు గురికావాలి..? ఎన్నాళ్లు ప్రజలు కూనీ కావాలి..?’ అని మమతాబెనర్జి ప్రశ్నించారు.
ఈశాన్య రాష్ట్రాల అక్కాచెల్లెల్లు తమ అక్కాచెల్లెల్లు అని, తాము మణిపూర్‌ను విడిచి వెళ్లబోమని బెంగాల్ సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం ఇచ్చిందని, ఇప్పుడు ఆ నినాదం ఎక్కడ పోయిందని ఆమె ప్రశ్నించారు. దేశంలో మహిళల పరిస్థితి దయనీయంగా మారిందని, బిల్కిస్ బానో కేసులో, మహిళా రెజ్లర్ల కేసులో నిందితులు బెయిల్‌పై బయటికొచ్చారని గుర్తుచేశారు.
మోదీ ప్రభుత్వం మహిళపై నేరాలకు పాల్పడే వారికి కొమ్ము కాస్తుందనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి నేతలను దేశంలోని మహిళలంతా కలిసి దేశ రాజకీయాల నుంచి తరిమికొట్టడం ఖాయమని మమత ధీమా వ్యక్తంచేశారు.