manipur| న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనుందని లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాకూర్ తెలిపారు. మణిపూర్లో పర్యటించాలని ఎంపీలు ఎప్పటినుంచో భావిస్తున్నా.. భద్రతా కారణాల పేరుతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణతో మణిపూర్ రగులుతున్నది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నబీజేపీ ప్రభుత్వాల అలసత్వం కారణంగానే రాష్ట్రం అట్టుడుకుతున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.