ముంబై: తనకు దైవ శక్తులున్నాయంటూ మరో బాబా ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బెదిరింపుల వల్ల బాధిత మహిళ కొంతకాలం మౌనంగా ఉన్నది. తాజాగా మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థను ఆమె ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (Nashik godman) మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల మహిళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నది.
కాగా, నాసిక్‌లో తనను తాను దేవుడిగా చెప్పుకునే ‘భోండు బాబా’గా ప్రసిద్ధి చెందిన మహేష్‌గిరి బాబా అలియాస్ మహేష్ దిలీప్ కాక్డే వద్దకు ఆ మహిళను ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆమెకు చికిత్స చేస్తానని ఆ బాబా హామీ ఇచ్చాడు. ప్రతి గురువారం పూజలకు ఆమె హాజరుకావాలని చెప్పాడు.
అయితే ‘భోండు బాబా’ క్రమంగా ఆ మహిళను ట్రాప్ చేయసాగాడు. ఆమె మొబైల్ ఫోన్‌కు వ్యక్తిగత, అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. 2024 ఆగస్ట్‌లో ఆ మహిళను ఏకాంత ప్రదేశానికి రప్పించాడు. ఆ తర్వాత కారులో లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెకు రుద్రాక్షలు చూపించాడు. ‘నాకు దైవ శక్తులు ఉన్నాయి, నువ్వు దేనినీ ఎదిరించలేవు’ అని భయపెట్టాడు. అత్యాచారం తర్వాత ఆమె నగ్న ఫొటోలు కూడా తీసి ఆమెను బెదిరించాడు.
మరోవైపు బాధిత మహిళ తన బంధువుకు ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో ‘భోండు బాబా’ బెదిరింపులు తీవ్రమయ్యాయి. ఆ మహిళను తన కార్యాలయానికి పిలిపించాడు. తాను ఒక ‘గూండా’ నని, పోలీసులను ఆశ్రయించవద్దని హెచ్చరించాడు. ఆ మహిళ మొబైల్ ఫోన్ తీసుకుని వేధింపులకు సంబంధించిన సందేశాలు, ఇతర ఆధారాలను డిలీట్ చేశాడు.
కాగా, భయం కారణంగా బాధిత మహిళ కొంతకాలం మౌనంగా ఉన్నది. ఇటీవల నాసిక్‌కు చెందిన జ్యోతిష్కుడు అశోక్ వశీకరణ పేరుతో పలువురు మహిళలను లొంగతీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడటం బయటపడింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ ధైర్యం చేసింది. మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థ అయిన అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిని ఆమె ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పి సహాయం కోరింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుతో ‘భోండు బాబా’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Watch: వధువు వీడ్కోలు చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్.. తర్వాత ఏం జరిగిందంటే?