న్యూఢిల్లీ: రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగిని దంపతులు అప్పు అడిగారు. ఆయన నిరాకరించడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. (Couple Kills Retired RBI Employee) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 63 ఏళ్ల మాధో రామ్ రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగి. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలిసి మందిర్ మార్గ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
కాగా, ఏప్రిల్ 19 ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి మొదటి అంతస్తులోని గదిలో కత్తి గాయాలతో మాధో రామ్ పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు మాధో రామ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అలాగే స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీంతో భార్యాభర్తలైన ఆజాద్ అలియాస్ జాజు, అతడి భార్య రుబీనాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, గోల్ మార్కెట్ ప్రాంతంలో నివసించే ఆజాద్ టైలర్‌గా పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం అప్పు కోసం మాధో రామ్‌ను అతడు కలిసినట్లు చెప్పారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్ కత్తితో మాధో రామ్‌ను పొడిచి పారిపోయినట్లు వివరించారు.
అయితే ఆజాద్ భార్య రుబీనా సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రక్తం మరకలు ఉన్న ఆజాద్ దుస్తులను ఆమె ఉతికిందని చెప్పారు. నేరాన్ని అంగీకరించిన నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Cops Steal Jewellery | వ్యాపారి ఇంట్లోకి చొరబడి.. నగలు దోచుకున్న పోలీసులు, సస్పెండ్
G Parameshwara | కబడ్డీ ఆటలో పందెం కాసిన హోంమంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం