జైపూర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. అధికారంపై ఉన్న శ్రద్ధ బీజేపీకి ప్రజలపై లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశం మొత్తం ఐదుగురు కార్పొరేట్ల చేతిలో బందీ అయిపోయిందని విమర్శించారు. దీంతో పాటు దేశం మొత్తం ఓ సంస్థ చేతిలోనే ఉండిపోయిందని పరోక్షంగా ఆరెస్సెస్‌పై ధ్వజమెత్తారు.
దేశంలో పెరిగిన ధలరలను నిరసిస్తూ జైపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలను కూల్చడంపైనే మోదీ శ్రద్ధ పెట్టారు తప్పించి, ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని ఐదారుగురు కార్పొరేట్ శక్తులు నడిపిస్తున్నాయని, వారి పనిలో మోదీ నిమగ్నులయ్యారని తీవ్రంగా దుయ్యబట్టారు.
నేనూ హిందువునే.. హిందుత్వ వాదిని మాత్రం కాదు: రాహుల్
జైపూర్ వేదికగా హిందుత్వపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునేనని ప్రకటించారు. అయితే హిందుత్వ వాదిని మాత్రం కాదని అన్నారు. ఈ రెండు పదాలకు చాలా అంతరం ఉందన్నారు. ప్రతి పదానికి ఓ అర్థముందని, దీన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ ఓ హిందువని, నాథూరాం గాడ్సే పూర్తి హిందుత్వవాదని వివరించారు. ”దేశ రాజకీయాల్లో నేటి రోజుల్లో రెండు పదాల మధ్య చాలా పోటీ నెలకొంది. అందులో ఒకటి హిందూ, రెండోది హిందుత్వ. ఈ రెండు పదాలూ చాలా భిన్నమైనవి. నేను హిందువునే. కానీ హిందుత్వ వాదిని మాత్రం కాదు. గాంధీ హిందువు. గాడ్సే హిందుత్వవాది” అని రాహుల్ పేర్కొన్నారు.