Hyperloop | న్యూఢిల్లీ : రవాణా రంగంలో భారత్ సరికొత్త విప్లవాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. అందుకోసం తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను సిద్ధం చేసుకున్నది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌ను రైల్వే శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది. దీని ద్వారా 350 కిలోమీటర్ల ప్రయాణాన్ని 30 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. అంటే ఢిల్లీ నుంచి దాదాపు 300 కి.మీ. దూరంలో ఉన్న జైపూర్‌కు అరగంటలోపే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. రైల్వే శాఖ నిధులతో మద్రాస్ ఐఐటీ క్యాంపస్‌లో హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ నిర్మితమైందని, ఆ ట్రాక్‌పై జరుగుతున్న పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. సాంకేతికతల అభివృద్ధికి దోహదపడే ఈ మొదటి ట్రాక్ నిర్మాణం కోసం మద్రాస్ ఐఐటీకి రెండు విడతల్లో మొత్తం రూ.17.43 కోట్లు ఇచ్చామని, ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసేందుకు మూడో విడతలో మరో రూ.8.71 కోట్లు ఇవ్వనున్నామని వివరించారు. హైపర్‌లూప్ తొలి వాణిజ్య ప్రాజెక్టును త్వరలో చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తున్నది.
ఐదో రకం రవాణా వ్యవస్థగా హైపర్‌లూప్‌ను చెప్తున్నారు. వాక్యూమ్ ట్యూబుల్లో ఉండే ప్రత్యేక క్యాప్సూల్స్ ద్వారా రైళ్లు అత్యధిక వేగంతో ప్రయాణించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. హైపర్లూప్లోని వాక్యూమ్ ట్యూబ్ లోపల విద్యుదయస్కాతపరంగా పైకిలేచే పాడ్ ఉంటుంది. తద్వారా ఫ్రిక్షన్, ఎయిర్ డ్రాగ్‌ను (రాపిడిని, గాలి లాగడాన్ని) నిర్మూలిస్తుంది. దీంతో పాడ్ గరిష్ఠంగా మాక్ 1.0 (గంటకు 761 మైళ్లు లేదా దాదాపు 1,225 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. ఇది విమాన వేగం కంటే రెండు రెట్లు అధికం.