హైదరాబాద్, మే 1: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముగింపు పలకాలని, ఈసారి భారత్ కేవలం పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముష్కరులను చంపడం మాత్రమే కాదని, అక్కడే తిష్ఠవేయాలని స్పష్టంచేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనంటూ పార్లమెంట్ ఇప్పటికే తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ అలాంటప్పుడు ఈసారి దానిపై చర్య తీసుకోవాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు పాకిస్థాన్‌పై చర్య తీసుకోదలిస్తే మీరు అక్కడికి వెళ్లి ఆ స్థలాన్ని (పీఓకేను) స్వాధీనం చేసుకోండి అని పేర్కొన్న ఒవైసీ పాకిస్థాన్‌పై నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్య తీసుకోవాలని, ఉగ్రవాదులు ఖాళీ చేసిన స్థావరాలను స్వాధీనం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.